శుక్రవారం, ఏప్రిల్ 27, 2012

గాంధీ, అంబేద్కర్, రాజ్యాంగ వ్యవస్థ


 గాంధీ, అంబేద్కర్, రాజ్యాంగ  వ్యవస్థ 


ద్యమాలు చాలా విషయాల పట్ల మన అవగాహనను పడునేక్కిస్తాయి. అపోహలను తొలగిస్తాయి. వాస్తవాలను అర్థం చేయిస్తాయి. అదే ఇప్పుడు తెలంగాణలో జరుగుతోంది. తెలంగాణా ప్రజలు ఉన్నట్టుండి ఇప్పుడు తమ పెద్దలందరినీ పేరుపేరునా తలుచుకున్తున్నారు. ఒక అలిశెట్టి ప్రభాకర్ ను, ఒక సాహూను వారి మిత్రులు స్మరించు కున్నట్టే  కొమురం భీమ్ జయంతిని ఉస్మానియా యూనివర్సిటిలో విద్యార్థులు ఘనంగా జరుపుకున్నారు. నాలుగు దశాబ్దాల తరువాత ఆనాటి తెలంగాణా యువతరం కథానాయకుడు జార్జి రెడ్డిని మళ్ళీ జనంలోకి తెచ్చి యువతరానికి వీరులంటే ఎలావుంటారో పరిచయం చేసారు. అదేవిధంగా ఈ సారి డా. అంబేద్కర్ ను కూడా స్మరించుకున్నారు.  గత రెండేళ్ళ నిరంతర పోరాటం అంబేద్కర్ గురించిన అవగాహనను పెంచింది.  అంబేద్కర్ జయంతి రోజు ట్యాంక్ బండ్ పరిసరాలు మరో గణేష్ నిమజ్జనాన్ని గుర్తుకు తెచ్చింది. అది ప్రతి ఏడాదీ ఉన్నదే అయినా ఈ సారి హైదరాబాద్ లో అంబేద్కర్ జయంతి జాతరను తలపించింది. దానికి తెలంగాణా వాదం కూడా ఒక కారణమని అనుకోవచ్చు. అంబేద్కర్ ఆంటే కేవలం దళితుల నాయకుడు మాత్రమే ఆన్న ప్రచారం, ఆయన బతికున్న కాలంలోనే మొదలై ఇంకా కొనసాగుతోంది. ఇప్పుడిప్పుడే ఆయనను చదువుతున్నవాళ్ళు ఆ ఆలోచనలనుంచి బయటపడుతున్నారు. అందులో తెలంగాణా ప్రజానీకం కూడా ఉండడం ఒక మంచి పరిణామం. 


తెలంగాణా ఉద్యమం వల్ల ప్రజలకు కొద్దో గొప్పో రాజ్యాంగ పరిజ్ఞానం కూడా అబ్బింది. ఇప్పుడు మన ఊళ్ళల్లో మూడో తరగతి చదివే పిల్లలకు కూడా రాజ్యాంగంలోని మూడవ ఆర్టికల్ లో ఏముందో తెలిసిపోయింది.  అంబేద్కర్ చిన్న రాష్ట్రాల గురించి ఏమన్నాడో వాళ్ళు చెప్పేస్తున్నారు.  ఈ అవగాహన  వల్లే ప్రజలు ఇంకా రాజ్యాంగం మీద చట్టసభల  నమ్మకంతో ప్రత్యేక  రాష్ట్రం  కోసం అలసటలేని పోరాటం చేస్తున్నారు. అది అంబేద్కర్ ఆచరణలో చూపిన  మార్గం. ఆ మార్గాన్నే ఇప్పుడు తెలంగాణా ఉద్యమం అనుసరిస్తోంది. బహుశ అదే శాసన సభ ఆవరణలో అంబేద్కర్ విగ్రహం ప్రతిష్టించాలనే డిమాండ్ కు కారణం అయ్యింది. ఈ డిమాండ్ ను తెలంగాణా వాదులు తెరమీదికి తేవడానికి   ఆయన పట్ల తెలంగాణా ప్రజలకు ఏర్పడ్డ గురి కూడా ఒక కారణం కావొచ్చు. విగ్రహాలతో సమాజంలో మహనీయుల పట్ల గౌరవం పెరుగుతుందన్న భ్రమలు నాకేమీ లేకపోయినా తెలంగాణా ఉద్యమం విగ్రహాలను ఆత్మ గౌరవ ప్రతీకలుగా మార్చివేసిన సందర్భంలో అంబేద్కర్ విగ్రహం కోసం డిమాండ్ చేయడం న్యాయమైనదని నమ్ముతున్నాను.


అయితే  రాజకీయ నాయకులు చెబుతున్నట్టుగా  అంబేద్కర్ కేవలం దళిత వర్గాలకే  నాయకుడని నేననుకోను. ఆయన తరతరాలుగా దాస్యంలో మగ్గిన భారతీయ మహిళలకు విముక్తిని ప్రసాదించిన దార్శనికుడు.  ఈ దేశంలో పుట్టిన ప్రతి శిశువుకూ నిర్భంద ఉచిత విద్య ఉండాలని వాదించిన మేధావి. కార్మికులకు కనీస హక్కులున్దాలని, వాటి సాధనకోసం సంఘటితమయ్యే అవకాశాలు ఉండాలని చట్టాన్ని రూపొందించిన శ్రామిక వర్గ పక్షపాతి. భారదేశంలో సమానత్వం రావాలంటే భూములను జాతీయం చేసి వ్యవసాయాన్ని పరిశ్రమగా గుర్తించాలని ప్రతిపాదించిన ధీశాలి. భారత దేశం బుద్ధుడు ప్రవచించిన సమానత్వం, సౌభ్రాతృత్వం, శాంతి సౌభాగ్యాలతో సమసమాజంగా విలసిల్లాలని కలలుగన్న స్వాప్నికుడు. ఆ కలలను నిజం చేసేందుకు తన అనుభవాన్ని, అధ్యయనాన్ని కలబోసి సమగ్రమైన రాజ్యాంగాన్ని అందించి ఇచ్చిన శాసనకర్త!   ఇలా చెప్పుకుంటూ పోతే అంబేద్కర్ స్పృశించని రంగమేదీ మిగలదు.   ఈ దేశంకోసం, దేశంలోని ప్రజలకోసం, భవిష్యతు కోసం అంబేద్కర్ అంతగా శ్రమించి, రాజ్యాంగ శాసన వ్యవస్థలను ప్రభావితం చేసిన  నాయకుడు  ఇంకొకరు పుట్టలేదు. తన నలభయ్యేళ్ళ రాజకీయ జీవితంలో ఇరవయ్యేళ్ళు గతాన్ని సవరించడానికి మరో ఇరవయ్యేళ్ళు భవిష్యత్తును నిర్మించడానికి ఆయన వెచ్చించారు.  అంబేద్కర్  ఈ దేశపు రాజ్యాంగ నిర్మాత కాబట్టి ఆ రాజ్యాంగ వ్యవస్థకు ప్రతిరూపమైన చట్టసభల ముందు అంబేద్కర్ విగ్రహం ఖచ్చితంగా ఉండి తీరాలి. ఎందుకంటే ఇప్పుడున్న చట్ట సభలైన    పార్లమెంటు, శాసన సభల రూపురేఖలు, విధివిధానాలు రూపొందించింది ఆయనే కాబట్టి. ఒక రకంగా ఈ దేశ చట్టసభలు అంబేద్కర్ నిర్మించిన శాసన సౌధాలు. వాటిముందు అసలైతే ఒక్క అంబేద్కర్ విగ్రహం మాత్రమే ఉండాలి!



కానీ హైదరాబాద్ నగరపు నడిబొడ్డున ఉన్న ఆంధ్ర్తప్రదేశ్ శాసన సభ ముందు  గంభీర మౌనముద్రలో కూర్చున్న గాంధీ విగ్రహం కనిపిస్తుంది.  ఇరవైరెండు అడుగుల ఎత్తున్న ఈ విగ్రహాన్ని తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 1988  లో ఏర్పాటు చేసారు. దీనికోసం ఆ కాలంలో 55 లక్షల రూపాయలు  ఖర్చుచేశారు. ఆ విగ్రహాన్ని చూసినప్పుడల్లా  గాంధీకి శాసన సభకు ఉన్న సంబంధం ఏమిటి అన్న అనుమానం కలుగుతుంది. రాజ్యాంగానికి, శాసన వ్యవస్థకు, చట్టబద్ధ పరిపాలనకు రూప శిల్పి  అయిన అంబేద్కర్ విగ్రహాన్ని శాసన సభ ఆవరణలో పెట్టడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అవలంబిస్తోన్న వ్యతిరేకత చూసిన తరువాత ఈ ప్రశ్న లేవనెత్తక  తప్పడం లేదు. హైదరాబాద్ తో పరిచయంగానీ, ఈ ప్రాంతంతో సంబంధం గానీ లేని అనేక మంది విగ్రహాలు టాంక్ బండ్ మీద ఉన్నట్టే చట్టసభాలతో పరిచయం గానీ, వాటిల్లో ప్రవేశానుభావంగానీ కనీసం చట్టలపత్ల్అ గౌరవం గానీ లేని గాంధీ విగ్రహం అసెంబ్లీ ఆవరణలో ఉండడంలో ఔచిత్యం అర్థం కాదు.గాంధీజీ  ఖచ్చితంగా గొప్ప నాయకుడే, కాదనలేం. స్వాతంత్ర పోరాటంలో ఆయనది కీలకమైన పాత్ర, జాతీయోద్యమానికి నాయకత్వం వహించిన వ్యక్తుల్లో ఆయన ముఖ్యులు. భారత దేశం నలుమూలలా పర్యటించి జాతీయ భావాన్ని విస్తరించడంలో గాంధీజీ  పాత్ర విస్మరించ వీలు లేనిది. అందుకే ఆయనను జాతిపిత అన్నారు. ఎవరు ఒపుకున్న ఒప్పుకోకున్నా ఆయన పేరుమీద దేశంలో అనేక వీధులు, వాడలు, రహదారులు మొదలు మహానగరాలే వెలిశాయి. అలాగే ఆయన విగ్రహాలు వీధివీధినా కనిపిస్తాయి. కానీ గాంధీ గారికి శాసన వ్యవస్థకు ఎలాంటి సంబంధమూ లేదు. అసలు ఆయనకు ఇప్పుడున్నరాజ్యాంగ వ్యవస్థ పట్ల గౌరవం కూడా లేదు.  గాంధీ ఇప్పటి పార్లమెంటరి ప్రజాస్వామ్యం  కంటే ధర్మకర్తల్లాంటి పాలకులుండే ఆదర్శవాద గ్రామ స్వరాజ్య నమూనాను కలగన్నాడు. ఆ రకమైన పాలనా వ్యవస్థ ఉండాలని మాత్రమే కోరుకున్నాడు. కానీ అప్పటి గ్రామీణ వ్యవస్థ కొందరికే స్వరాజ్యం లా ఉండేది. అనేక అసమానతల నడుమ, కుల, మత, ఆధిపత్య , భూస్వామ్య ధోరణులతో నిండి ఉంది అనేక మందికి అదొక నరక ప్రాయమైన వ్యవస్థగా ఉండేది. దళితులు, ఇతర పీడిత వర్గాలు, సేవా కులాలు, వృత్తులకు కనీస గౌరవంలేని సనాతన విలువలతో ఉండేది.


డా. అంబేద్కర్  అటువంటి వ్యవస్థ స్థానంలో స్వేచ్చ తో పాటు సమ భావన, సౌభ్రాతృత్వం సాధించే దిశగా నూతన  భారత రాజ్యాంన్గాన్ని రూపొందించారు. పాత సాంప్రదాయిక విలువల స్థానంలో నూతన లౌకిక ప్రజాస్వామ్య వ్యవస్థకు రాజ్యాంగం ద్వారా పునాదులు వేసే ప్రయత్నం చేసారు. ప్రభుత్వం ఎలా నడవాలి, పౌరులు ఎలా నడుచుకోవాలో రాజ్యాంగం ఇర్దేశించింది. ఒక మనిషికి ఒక ఓటు, ఒకే విలువ అని చెప్పడం ద్వారా సామాజిక ఆర్ధిక అసమానతలు, అంతస్తుల అంతరాలు లేకుండా అందరికీ సమాన హక్కులు, అధికారాలు ఉండే వ్యవస్థకోసం రాజ్యాంగం కృషి చేసింది. భారత ప్రజలందరికీ సమానమైన, సముచితమైన  ప్రాతినిధ్యం కల్పించే ప్రయత్నం రాజ్యాంగం చేసింది. గాంధీ గ్రామీణ వ్యవస్థలో పెత్తందారీ  కర్రపెత్తనం ఉండాలనుకున్నాడు కానీ సార్వత్రిక ఓటింగు ను సమర్థించలేదు. ఆయన పరోక్ష ప్రజాస్వామ్యాన్ని ఇష్టపడ్డాడు. ప్రజాస్వామ్యం గ్రామంలో పెద్దమనుషులను ఎన్నుకుంటే, ఆ పెద్దమనుషులు పై స్థాయి పాలకులను ఎన్నుకోవాలని కోరుకున్నాడు. కానీ ఆ పెత్తందారీ వ్యవస్థను తుతునియలు చేసే సాధనంగా డా. అంబేద్కర్ రాజ్యాంగాన్ని మలిచాడు.  రాజ్యాంగం అమాలౌతున్నడా లేదా  అన్నది వేరే చర్చ కానీ ఇప్పటికీ ప్రభుత్వాలకు, ఆ ప్రభుత్వాలకు దిశా నిర్దేశం చేసి నడిపించేది రాజ్యాంగమే! రాజ్యాంగ రచన కోసం డాక్టర్ అంబేద్కర్ దాదాపు మూడు సంవత్సరాల తన విలువైన జీవిత కాలాన్ని వెచ్చించాడు. రాజ్యాంగ రచనా సంఘ సారధిగా ఆయన రాత్రింబవళ్ళు కృషి చేసారు. వివిధ దేశాల రాజ్యన్గాలను ప్రరిశీలించి మనదేశానికి అవసరమైన పాలనా సూత్రాలను రాజ్యాంగ రచనా సంఘం ముందు చర్చకు పెట్టారు. అనేక విమర్శలు, అవమానాలు  అధిగమించి మొత్తంగా భావితరాలకు దిక్సూచిగా నిలువగలిగే ఒక అత్యుతమ రాజ్యాంగాన్ని ఈ దేశానికి అందించారు. కానీ గాంధీ గారు నాయకత్వం వహించిన కాంగ్రెస్ పార్టీ ఆయన వారసులమని చెప్పుకునే వారు ఇప్పుడు దాన్నొక చిత్తుకాగితంగా మార్చేసారు.


రాజ్యాంగ రచనా కాలంలో గాంధీ గారు బతికే ఉన్నారు, ఆ కాలంలో దేశవ్యాప్తంగా పర్యటించడం, భజనలు, ప్రార్థనా సమావేశాల్లో కాలక్షేపం చేయడం చేసే వారు తప్ప ఏ ఒక్కరోజుకూడా రాజ్యాంగ రచనా సంఘానికి తన సలహాలో  సూచనలో చేయలేదు. గాంధీ గారు రాజ్యాంగం ఎలా ఉండాలో తెలియజేస్తూ 1946 లో కాంగ్రెస్ పార్టీకి ఒక నివేదిక ఇచ్చారని రెండో సారి   ఆయన హత్యకు గురవడానికి ఒకరోజు ముందు కూడా నూతన రాజ్యాంగానికి సంబంధించి ఒక ముసాయిదా రూపొందించారని చెపుతారు. అందులో కేంద్రీకృత పార్లమెంటరి ప్రజాస్వామ్యం కాకుండా , గ్రామ స్వరాజ్యం దిశగా వికేంద్రీకరణ జరగాలని, కాంగ్రెస్ పార్టీని రద్దుచేసి దానినొక సేవా సంస్థగా మార్చివేయాలని,  ఆ సంస్థద్వారా దేశవ్యాప్తంగా పంచాయతీలను అనుసంధానం చేయాలని సూచించారని అంటారు. అదే జరిగితే జవహార్ లాల్ నెహ్రూ అప్పుడు ప్రధాని కాలేక పోయేవారు. సోనియా గాంధీకి ఇప్పుడు తన కొడుకు రాహుల్ గాంధీని ప్రధానిని చేయలేక పోయానన్న చింత ఉండేది కాదు!  అది వేరే సంగతి!!. 

డా. అంబేద్కర్ శాసనం ఏ రూపంలో ఉన్నా దాన్ని ప్రజలకు అనుకూలంగా మలచాలని ప్రయత్నించాడు.  పెత్తందారీ ధర్మకర్తలకంటే చట్టం, న్యాయం మాత్రమే ధర్మాన్ని నిలబెడుతుందని నమ్మాడు. ముఖ్యంగా అప్పటి బ్రిటీష్ పాలకుల మీద తన ఒత్తిడిని పెంచి   పాలనా వ్యవస్థను ప్రజాస్వామ్యీకరించే ప్రయత్నం చేసాడు. బ్రిటీష్ వాళ్ళు పరిపాలిస్తోన్న కాలంలో అప్పటి పాలకులకు ఈ దేశం గురించి, దేశంలోని ప్రజల సమస్యల గురించి, ప్రాధమిక అవసరాల గురించి, వాటి పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యల గురించి, చేయాల్సిన చట్టాల గురించి మొట్టమొదటి సారిగా సమగ్రంగా నివేదించిన వారిలో డా. అంబేద్కర్ ఆద్యుడని చెప్పుకోవాలి. డా. అంబేద్కర్ సమకాలికుల్లో చాలామంది బ్రిటీష్ పాలకుల ప్రాపకంలో పెరిగారు. వాళ్ళ ప్రమేయంతో, వాళ్ళ కొలువులో చేరడానికి వాళ్ళ సొమ్ములతో లండన్ వెళ్లి ఉన్నత చదువులు చదువుకున్నారు. వచ్చాక కొందరు బ్రిటీష్ కొలువులో చేరి పాలకులుగా మారిపోతే  మరికొందరు స్వాతంత్ర పోరాటంలో క్రియాశీలంగా పాల్గొన్నారు తప్ప భారతీయ పరిపాలనా వ్యవస్థను మానవీకరించాలని గానీ, రాజకీయ వ్యవస్థను ప్రజా స్వామ్యీకరించాలని గానీ ఏ ఒక్కరూ ఆలోచించలేదు. ఆ మాటకొస్తే గాంధీ లండన్ లో చదువు పూర్తిచేసుకుని తిరిగిరాగానే దేశం గురించి ఆలోచించలేదు. రాజ్కోట్ కోర్టులో ప్రాక్టీసు మొదలుపెట్టాడు. అది సరిగా నడవక పోయేసరికి దక్షిణాఫ్రికా లో గుజరాతీ షావుకార్ల తరపున వాదించడానికి డర్బన్ వెళ్లి అక్కడే దాదాపు ఇరవై ఏళ్ళకు పైగా ప్రాక్టీసు చేస్తూ స్థిరపడ్డాడు.

అంబేద్కర్ అలా చేయలేదు. దేశీయ పాలకుల సహాయంతో విదేశాలకు వెళ్లి చదువు పూర్తికాగానే తిరిగి  వచ్చిన వెంటనే సామాజిక వ్యవస్థ ప్రక్షాళనకు నడుం కట్టాడు. అందుకు అందివచ్చిన ప్రతి అవకాశాన్ని వాడుకున్నాడు. దాదపు ఇరవయ్యేళ్ళ పాటు న్యాయవాదిగా, పాత్రికేయుడిగా,  ప్రొఫెసర్ గా ఉంటూ అనేక ఉద్యమాలను నిర్మించాడు. సమాజంలో పేరుకు పోయిన దురాచారాలను చట్టాలద్వారా రూపుమాప గలమని నమ్మాడు. అందుకోసం బలమైన ప్రజా ఉద్యమాలు నిర్మించి బ్రిటీష్ పాలకులను ఆలోచించే విధంగా చేసాడు.  మొదటిసారిగా 1919 లో అప్పటి బ్రిష్ ప్రభుత్వం పరిపాలనా సంస్కరణల కోసం ఏర్పాటు చేసిన మాంట్-ఫోర్డ్ కమిటీ   అంబేద్కర్ ను సంప్రదించింది. అంటరాని సమాజంలో బొంబాయి రాష్ట్రంలో డిగ్రీ వరకు చదివిన ఒకే ఒక్క వ్యక్తిగా అంబేద్కర్ ను తన ఆలోచనలు చెప్పమని అడిగింది. కమిటీ ముందు ఆయన  ప్రత్యేక నియోజకవర్గాలు, సార్వత్రిక ఓటింగ్ గురించే కాక భారతీయ సమాజంలో ఉన్న అసమానతలు, విద్యావకాశాల ఆవశ్యకత, సాంఘీక సంస్కరణలు, తేవాల్సిన శాసనాల గురించి సమగ్రమైన నివేదిక అందించారు. భారత దేశానికి చట్టాలు చేసేముందు సమాజాన్ని అర్తంచేసుకోవాలన్న ప్రతిపాదన చేసారు.  ఆ తరువాత  1925  లో భారత దేశ ద్రవ్య వినిమయ విధానంలోని సమస్యలను అధ్యయనం చేయడానికి వచ్చిన  రాయల్  కమీషన్ ముందు హాజరై తన ఆలోచనలు  పంచుకున్నాడు. అప్పుడే ఆయన ఉమ్మడి వ్యవసాయం, భూమిశిస్తు విధానం, భూసంస్కరణల   గురించి ప్రతిపాదనలు చేసారు.  అదే కాలంలో ఆయన  బొంబాయిలో చట్టసభలో క్రియాశీలమైన పాత్ర పోషించాడు.

ఆ తరువాత భారతదేశంలో చట్టబద్ధమైన పరిపాలనను అందించే రాజ్యాంగ నిర్మాణం కోసం 1928  లో వచ్చిన సైమన్ కమీషన్ ను బహిష్కరించాలని గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ పిలుపునిచ్చింది. అప్పటికి కాంగెస్ స్వాతత్ర్యం కోసం తీర్మానం చేయలేదు. అయినప్పటికీ కమీషన్ లో భారతీయులకు ప్రాతినిధ్యం లేదని నిరసిస్తూ దేశవ్యాప్తంగా ఆందోళన లేవదీసింది. అంబేద్కర్ మాత్రం పూనాలో కమీషన్ ముందు హాజరై భారత దేశంలో శాసన రాజ్యాంగ వ్యవస్థ ఎలా ఉండాలో ఒక నివేదిక అందించారు. అందులో సార్వత్రిక ఓటు హక్కుతో పాటు, అస్ప్రుష్యులకు ప్రత్యేక ప్రాదేశిక నియోజక వర్గాల ప్రస్తావనఒకటి. కమీషన్ అంబేద్కర్ సూచనలేవీ పరిగణలోకి తీసుకోక పోవడంతో ఆయన లండన్ లో నిర్వహించిన రెండు రౌండ్ టేబుల్ సమావేశాలకు హాజరై తన వాదనలు వినిపించాడు. దాదాపు అయిదు సంవత్సరాల పాటు పోరాడి అంబేద్కర్ కొద్దో గొప్పో అణగారిన వర్గాలను ప్రజాస్వామ్య శాసన నిర్మాణ వ్యవస్థలో బాగాస్వాములను చేయాలని ప్రయతిన్స్తే గాంధీ దాన్ని అడ్డుకోవడానికి ఎరవాడ జైలులో నిరాహార దీక్షకు దిగి చివరకు ఆ అవకాశాలు అందకుండా చేసాడు. ఈ ఒక్క విషయంలోనే కాదు గాంధీజీ కి తన మీద, తన నాయకత్వం, ఆలోచనల మీద ఉన్న నమ్మకం చట్టాల మీద ఎన్నడూ లేదు. అనేక సార్లు ఆయన శాసన బద్ధమైన పాలననువ్యతిరేకించాడు.  గాంధీ స్వయంగా శాసనాలను ఉల్లంఘించాడు. శాసనోల్లంఘనకు పిలుపునిచ్చాడు. 1922 - 42 మధ్యకాలంలో గాంధీ జీ  అనేక సార్లు చట్టాలను ఉల్లంఘించి జైలు కు వెళ్ళాడు. ఇదంతా స్వాతంత్రం కోసమే అని మనం సరిపెట్టుకోవచ్చు. కానీ చట్టం ముందర ఆయన మాత్రం దోషిగానే నిలబడ్డారు.

మరోవైపు ఇదే  కాలంలో ఒకవైపు సమాజాన్నిమానవీకరించే ప్రయత్నం చేస్తూనే అంబేద్కర్ భారత దేశంలో రాజ్యాంగబద్ధమైన పాలనకోసం, శాసన వ్యవస్థకోసం ఎనలేని కృషి చేసారు. బ్రిటీష్ ప్రభుత్వం భారత దేశంలో రాజ్యాంగ సంస్కరణల కోసం ఏర్పాటు చేసిన సంయుక్త పార్లమెంటరీ కమిటీ సబ్యుడిగా 1932 -34 మధ్య కాలంలో విశేషమైన సేవలు అందించి, భారత దేశంలో ప్రజాస్వామిక పాలనకు బ్రిటీష్ కాలంలోనే బీజాలు వేసారు. అదే 1935 లో భారత ప్రభుత్వ చట్టం పేరుతొ  భారత ప్రభుత్వ పాలనా వ్యవస్థకు స్వయంప్రతిపత్తి కల్పించి స్వతంత్ర అధికారాలను ఇచ్చింది. దేశంలో చట్టబద్ధ పాలనకు ఆస్కారం కలిగించింది. 1941 లో బ్రిటిష్ ప్రభుత్వంలో రక్షణ సలహా మండలి సభ్యుడిగా, వైస్రాయ్ కౌన్సిల్ లో లేబర్ మెంబర్ గా ఆయన అనేక చట్టాలకు రూపకల్పన చేసారు. అప్పటి భారత దేశంలో కార్మిక సంఘాల చట్టాన్ని  రూపొందించింది కూడా డా. అంబేడ్కరేనన్న సంగతి చాల మందికి తెలియక పోవచ్చు. ఆ తరువాత భారత రాజ్యాంగ నిర్మాణంలో ఆయన పాత్ర, ఆ తరువాత నెహ్రూ ఆహ్వానం మేరకు భారతదేశ తొలి న్యాయశాఖా మంత్ర్హిగా ఆయన కృషి పార్లమెంటరి వ్యవస్థకు వన్నె తెచ్చే విధంగా ఉండింది. భారత దేశంలోని మహిళలను మనుషులుగా గుర్తించి వాళ్ళ హక్కులకు పూచీగా నిలబడ్డ హిందూ కోడ్ బిల్ ను రూపొందించిన అంబేద్కర్ చివరకు ఆ శాసనాన్ని గౌరవించని ఆధిపత్య ధోరణులకు నిరసనగా పదవిని వదులుకుని చట్టసభల నుంచి పూర్తిగా వైదొలిగారు. 
  
అంబేద్కర్ జీవితంలో ఎప్పుడూ విగ్రహాలను నమ్మలేదు. విగ్రహారాధననే వద్దనుకున్నాడు. కానీ తన విగ్రహాలే భవిష్యత్తులో  చైతన్య ప్రతీకలుగా నిలబడతాయని, కోట్లాది మందిని  ఆత్మ గౌరవంతో నిలబెడతాయని ఆయన ఊహించి ఉండదు. డా. అంబేద్కర్ జీవితం, పోరాటం, ఆదర్శాలు ఇప్పుడిప్పుడే వెలుగులోకి వస్తున్నాయి. అంబేద్కర్ ను గుండెల్లో నిలుపుకోవడానికి, ఆయన ఆశయాలను చిరస్థాయిగా, సజీవంగా నిలబెట్టడానికి ఇప్పుడు దేశంలో కోట్లాది మంది సిద్ధంగా ఉన్నారు. అందులో ఇప్పుడు తెలంగాణా ప్రజలు కూడా కులమతాలకు అతీతంగా ఆ జాబితాలో చేరిపోయారు. ఆయన విగ్రహాలు పార్లమెంటు మొదలు గ్రామ సచివాలయం దాకా అన్ని రాజ్యాంగ వ్యవస్థల ముందు ఉండాలని కోరుకోవడం న్యాయమయిందే.  కానీ ఆ చట్ట సభలే ఇప్పుడు రాజ్యాంగ లక్షాలకు విరుద్ధంగా పాలన సాగిస్తున్నాయి. చట్ట వ్యతిరేక శక్తులకు, అసాంఘీక కార్యకలాపాలకు కేంద్రాలయిపోతున్నాయి. వాటిముందు వేలెత్తి నిలదీసే అంబేద్కర్ లాంటి ఆదర్శ మూర్తి కంటే మౌనముద్రలో కూర్చుండే ఉత్సవ విగ్రహాలు ఉండడమే మంచిదేమో!  

ప్రొ. ఘంటా చక్రపాణి 
రచయిత సమాజ శాస్త్ర ఆచార్యులు, రాజకీయ విశ్లేషకులు  
  ఈ మెయిల్ : ghantapatham@gmail.com

మంగళవారం, ఏప్రిల్ 10, 2012

తెలంగాణాకు ఒక కొత్త ఫేస్ బుక్ కావాలి!


' మిమ్మల్ని మీరు దహించుకోకండి. 2014 వరకు ఆగండి, అప్పుడు తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీలను కాల్చిపారేయవచ్చు'. 
ఇది తెలంగాణా విద్యార్థులకు హరి రాఘవ్ అనే ఒక యువకుడు పేస్ బుక్ ద్వారా ఇచ్చిన సందేశం. నేను పెద్దగా పేస్ బుక్ ఫాలో అవకపోయినా అప్పుడప్పుడు చూస్తుంటాను. ఇలాంటి సందేశాలు చూసినప్పుడు సోషల్ మీడియా నిజంగానే మనకు చాలా మేలు చేస్తోందని అనిపిస్తుంది. ముఖ్యంగా  తెలంగాణా ఉద్యమానికి ఇదొక వారధిగా మారిపోయింది. ఒక చిన్న సంఘటన జరిగితే చాలు క్షణాల్లో అది ప్రపంచ వ్యాప్తంగా ప్రసారమై పోతోంది. మరుక్షణం లక్షలాది చేతులు పిడికిల్లై బిగుసుకున్తున్నాయి. వేలాది గొంతులు ఒక్కటయి నినదిస్తున్నాయి. ఆవేశం, ఆవేదన, ఆలోచనల సమ్మిశ్రిత సందేశాలు ప్రపంచం నలుమూలలనుంచి మనకు చేరిపోతాయి సందేశాలు చదివినప్పుడు తెలంగాణాకు దిగులు అక్ఖరలేదని అనిపిస్తుంది.
 ఇప్పుడు తెలంగాణా వాదం ఒక్క తెలంగాణా గడ్డమీదే కాదు ప్రపంచంలో మనిషనేవాడు సంచరిస్తోన్న ప్రతి దేశంలోనూ ప్రాణంతో ఉన్నందుకు ఆనందమేస్తుంది. భోజ్యా నాయక్  ఆత్మహత్య పట్ల   వీరా రెడ్డితండా తల్లదిల్లినట్టుగానే వీళ్ళంతా తల్లదిల్లారు.  ఎవరికి తోచిన రీతిలో వాళ్ళు స్పందించారు. చావోద్దని సొంత తమ్ములకు చెప్పినట్టు చెప్పారు. ఇంట్లో అమ్మా, నాన్న చెల్లెలు, తమ్ముళ్ళు ఉంటారని వాళ్ళను అనాధలను చేసి ఆత్మ హత్యల పాలు కావోద్దని చెప్పారు. ఆత్మహత్య తరువాత జీవితం మిగిలి ఉండదని గుర్తుంచుకోవాలని వేరే పోస్టర్ లో హెచ్చరించాడు. కానీ  తెలంగాణా రాకపోతే జీవితం లేదని మనమే కదా వాళ్లకు చెప్పాం. తెలంగాణా వాదాన్ని పదునేక్కించిన మాటలు, ఆటలు, పాటలు అదే కదా బోధించింది. అలా భయపడి, బెంగపడి కూడా చివరకు రెండేళ్ళు పోరాటంలో నదిచేకదా భోజ్యానాయక్ నడిరోడ్డుమీద నిప్పు రవ్వై రగిలిపోయింది. ఒకరిని చూసి ఒకరు ఒక్కవారంలో ఏడుగురు అలా బలయిపోవడం తెలంగాణలో విషాదం నింపింది.     అందరిలో ఆవేదన ఉన్నదే తప్ప ఆత్మహత్య ఆలోచనలో ఉన్న వారిని ఊరడించగలిగే ఉపాయమేదీ కనిపించలేదు. కానీ హరి రాఘవ్ సందేశం మాత్రం స్పష్టంగా ఒక పరిష్కారాన్ని చూపినట్టు కనిపించింది.
 హరి రాఘవ్ ఎవరో తెలియదు. పేస్ బుక్ స్టేటస్ ప్రకారం హైదరాబాద్ లో ఉండే సైకాలజిస్ట్. భోజ్యా నాయక్ సజీవదహనం తరువాత ఆత్మహత్యలకు  వ్యతిరేకంగా అనేక విధాలుగా ఆయన స్పందించారు. అనేక  పోస్టర్లు తయారు చేసారు. కవితలు, పాటలు పోస్ట్ చేసారు. ఆత్మహత్యలకు కారణాలు విశ్లేషిస్తూ చనిపోవడం వల్ల కలిగే నష్టాలు ఏకరువు పెట్టారు. తాజాగా 2014 ఎన్నికల్లో తెలంగాణా వ్యతిగ్రేక పార్టీలను దహనం చేయడం తప్ప మార్గం లేదనీ, కాబట్టి అప్పటిదాకా ఆగమని పిలుపునిచ్చారుహరి రాఘవ్ లాగే నిశాంత్ దొంగారి, సమత, పాండు, మహి ఇట్లా అనేకమంది స్పందించారు. ఎవ్వరూ నిరాశ పడట్లేదు. 2014 దాకా ఆగదామనే అంటున్నారు

నిజమే తెలంగాణా ఏర్పాటు ఒక రాజకీయ ప్రక్రియ. పార్లమెంటు ద్వారా జరగాల్సిన పని. తెలంగాణా సాధనకు ఒకే ఒక మార్గం పార్లమెంటులో బిల్లు పెట్టడం. ఖచ్చితంగా అది రాజకీయ పార్టీల ద్వారానే సాధ్యం. అలాంటప్పుడు  వ్యక్తిగత హింస, ఆత్మాహుతుల వల్ల ప్రయోజనం ఏముంటుంది? ఇది ఇప్పుడు తెలంగాణా సమాజం అర్థం చేసుకోవాలి
అలా ఆంటే తెలంగాణా ఏర్పాటు 2014 దాకా సాధ్యం కాదని, అప్పటిదాకా ఆలోచించవద్దని, ఉద్యమాలు అక్ఖర లేదని కాదు. ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల్లో తెలంగాణా ఎప్పుడైనా యేర్పడ వచ్చు. ఎప్పుడనేది తేల్చాల్సింది ప్రభుత్వం కాదు, ఉద్యమం. నిజంగానే మరోసారి ఉద్యమం ఉవ్వెత్తున లేస్తే  ఖచ్చితంగా ప్రభుత్వం దిగి వస్తుందిఒకవేళ ఇప్పుడిప్పుడే అది సాధ్య పడక పోయినా 2014 నుంచి ఎవరూ తప్పించుకునే వీలులేదు. అలావీలు లేని స్థితిని సృష్టించాల్సిన బాధ్యత ఉద్యమానిది.  ప్రజలను దహించి వేస్తోన్న భావోద్వేగాలను చల్లార్చకుండా ఆత్మ హత్యలు ఆగాలని కోరుకోవడం అత్యాశే అవుతుంది కాబట్టి దిశగా ఉద్యమ కార్యాచరణ ఉండాలి. ఉద్యమం ఇప్పుడు పూర్తిగా కాంగ్రెస్ పార్టీ టార్గెట్ గా సాగాలి.
కాంగ్రెస్ నాయకులు ముఖ్యంగా తెలంగాణా మంత్రులు,  ఎం ఎల్ లు, ఎం పీలు నాటకంలో ఎవరి అంకాన్ని వాళ్ళు రక్తికట్టిస్తున్నారు. ఒకవైపు తెలంగాణా వాదులుగా చెలామణీ అవుతూనే మరోవైపు అదే పార్టీలో అదే పదవిలో కొనసాగుతున్నారు. ఆంటే కాకుండా పార్టీ బలోపేతానికి ప్రయత్నాలు చేస్తున్నారు. వీళ్ళ నాటకానికి తెరపడాలంటే ఉద్యమం ఒక బరిగీసి నిలబడాలి. ఉద్యమంతో నిలబడేవారే తెలంగాణా వాదులని మిగిలిన వారంతా ద్రోహులేనని ప్రకటించాలి. ఇది చేయకపోతే కాంగ్రెస్ లోనే తెలంగాణా వాదులని చెప్పుకునే వాళ్ళు రోజోకరి ఇంట్లో టిఫిన్ కో, భోజనానికో కలుస్తారు.   అది తెలంగాణా కోసమే అని నమ్మబలుకుతారు. వారానికో గుంపు ఢిల్లీ వెళ్లి పైరవీలు, పనులు చేసుకుని వస్తారు. అధిష్టానం తోనో, కాకపోతే అమ్మతోనో మాట్లాడామని చెపుతారు. నెలా రోజుల్లో అని ఒకడంటే, వారమే అని ఇంకొకడు వాగుతుంటారు. పదవిలో లేని వాడు ఇప్పుడిప్పుడే తెలంగాణా రాదని   కుండ బద్దలు కొడతాడుఇది ప్రజల మీద మరీ ముఖ్యంగా తెలంగాణా కోసం పడి చచ్చే అమాయకజనాల  మీద తీవ్రమైన ప్రభావం చూపిస్తుంది.
  అస్పష్ట పరిస్తితులను అనుకూలంగా మలచుకోవడానికి కాంగ్రెస్ ఇప్పుడు స్థానిక సంష్తల ఎన్నికలను తెర మీదికి తెస్తోంది. తెలంగాణలో తెలుగుదేశం నామరూపాలు లేకుండా పోయిన పరిస్థితులను అవకాశంగా తీసుకొని పార్టీని పటిష్ట పరచుకోవాలని చూస్తోంది. ఆంధ్రాలో త్వరలో జరుగబోయే అసెంబ్లీ ఎన్నికల తరువాత స్థానిక  ఎన్నికలు ఉంటాయని అంటున్నారు. అదే నిజమైతే తెలంగాణా కాంగ్రెస్ నాయక్యులను నిలదీయడానికి ఇంతకంటే మంచి సమయం ఇంకొకటి ఉండదు. ఇది ఉద్యమం నీరుగారిందనో, తెలంగాణా రాదనో దిగులు పడే వారికొక ధైర్యాని ఇస్తుంది

ఇక రెండోది ఉద్యమం ఒక దీర్ఘ కాలిక ప్రక్రియ ఆన్న సంగతి  ప్రజలు అర్థం చేసుకోవాలి. జే సీలు రాజకీయ పార్టీలు విషయం స్పష్టంగా చెప్పాలి. 2014 ను అంతిమ గడువుగా ప్రకటించాలితెలంగాణా ఉద్యమం ఒక ప్రవాహంలా కదలడం లేదు. అల లాగా ఎగిసి పడుతోంది. అలల్లో అలా పైకి లేచిన వాళ్ళు ఒక్క సారిగా మళ్ళీ కుప్పకులేసరికి  తట్టుకోలేక పోతున్నారు. ఉద్వేగ ఉద్దాన పతనాలు సామాన్యులను తీవ్రంగా కలతకు గురిచేస్తున్నాయి  కాసేపు పరుగెత్తడం, అంతకు రెట్టింపు సమయం విశ్రమించడం వల్ల గమ్యం చేరతామా లేదా అనే అయోమయం సహజం. కాబట్టి ఉద్యమం ఇప్పుడు నడక నేర్చుకోవాలి. నడకకు ఒక గమ్యం ఉండాలి. గమ్యం 2014 అని స్పష్టం చేసుకోవాలి.  ఆలోపు వస్తే సంతోషం రాకపోతే అదే అంతిమ సమరం ఆన్న విషయం అర్థం చేయించాలి.
పార్లమెంటరి ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎన్నికలు మినహా వేరే అవకాశాలు ప్రజల చేతిలో ఉండవు. కాబట్టి ఎన్నికలు మధ్యంతరంగా సృష్టించాదమో లేకపోతె ఎన్నికల సమయం దాకా నిలబడి ఆగడమో చేయాలి. ఇప్పుడు ఎవరినీ రాజీనామా చేయాలని అడక్కరలేదు. వాళ్లకు వాళ్ళుగా రాజీనామా చేసే పరిస్థితులు కల్పించాలి. నిజానికి ఇన్ని బలిదానాలతో పనిలేకుండా తెలంగాణా కాంగ్రెస్ నాయకులు తలుచుకుంటే ఒక్క నెలలో  తెలంగాణా ప్రక్రియ మొదలవుతుంది.
 ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఉన్న స్థితి, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఉన్న దివాలా పరిస్థితుల్లో అది మరీ సులభం. కాంగ్రెస్ పార్టీ శాసన సభ్యులు మంత్రులు ఒక ఇరవై మంది రాజీనామా చేస్తే సరిపోతుంది. అందరూ ఒకేసారి రాజీనామా చేస్తే భావోద్వేగాల్ని నాదెండ్ల మనోహర్ అడ్డు చెప్పే అవకాశాలుంటాయి కాబట్టి రోజుకొకరు చొప్పున ఇరవై రోజుల్లో కనీసం ఇరవై మంది శాసన సభ్యలు రాజీనామా చేస్తే తెలంగాణా రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ మొదలు పెట్టడానికి పదిరోజుల సమయం చాలు. ఆంటే  ఇన్ని చావుల అవసరం లేకుండా ఒక్క నెలలో  తెలంగాణా తేగలిగే శక్తి కాంగ్రెస్ నాయకులకు ఉంది.   ఉద్యమం చేయాల్సిందల్ల వాళ్లకు వాళ్ళు తలవంచే పరిస్థితులు సృష్టించడం. అలా చేయాలంటే వాళ్ళ రాజీనామాలు కోరుతూ కోదండరామ్ ప్రకటనలు చేయడం కాదు. అలా చేస్తే కోదండరామ్ టీ ఆర్ ఎస్  తొత్తు అనో, బీ జే పీ బంటు అనో ప్రచారం చేసే అవకాశం ఉంది. కాబట్టి రాజీనామా చేయక పొతే రోజు గడవని పరిస్థితులు ఉద్యమం ద్వారా కల్పించాలి

ఇవన్నీ సాధ్యపడాలంటే తెలంగాణాకు ఒక నిజమైన పేస్ బుక్ కావాలి. జనంలో ఒకరినుంచి ఒకరికి అల్లుకుపోగలిగే సోషల్ నెట్ కావాలి. అది జే సి పునర్వ్యవస్తీకరణతోనే సాధ్యమౌతుంది. ఇప్పుడున్న జే సి లో ఎన్నికల రాజకీయాలకు అతీతంగా ఉద్యమంకోసం ఉన్న సంఘాలు, సంస్థలు ఇరవైకి పైగానే ఉన్నాయి. వాటితో పాటు బయట ఉంటూ తెలంగాణాకోసం నిజాయితీగా పనిచేస్తోన్న పౌరసమాజంతో జే సి ఏర్పడాలి. ఇప్పుడు జే సి కి ఊరూరా ప్రతినిధులున్నారు. అలా లేనిచోట ఉద్యోగులు, న్యాయవాదులు, ఉపాధ్యాయులు, పాత్రికేయులు, విద్యావంతులు, విద్యార్థులు  ఎవరో ఒకరున్నారు. ఎవరూలేనిచోట సామాన్య ప్రజలున్నారు. అంతా కలిస్తే తెలంగాణాకు అతిపెద్ద సోషల్ నెట్ వర్క్ అయితీరుతుంది. ఎవరి ఆదేశాలు, సలహాలతో పనిలేకుండా ఒక స్వతంత్ర సంస్థగా జే సి నిలబడుతుంది. ఉద్యమాన్ని రాజకీయ అవసరాలకు అనుగుణంగా కాకుండా ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా నడిపించే ఆవకాశం ఉంటుంది. ఇది జరగాలంటే దానికి ముందు ఇప్పుడున్న జే సి పూర్తిగా  ప్రక్షాళన జరగాలి.
మహబూబ్ నగర్ ఎన్నికల ఫలితం తరువాత జీ సి విశ్వసనీయత సంనగిల్లినట్టు కనిపిస్తోంది. పరస్పర విరుద్ధమైన ఎజెండాలతో ఉన్న టీ ఆర్ ఎస్, బీ జే పీ లు ఒకే రాజకీయ జే సి లో ఉండడం విస్మయం కలిగించే విషయం. రాజకీయ జే సి కి రాజకీయ ఎజెండా ఉండాలి. ప్రణాళికా ఉండాలి. కానీ ఇప్పుడు జే సి లో అటు ఐక్యతా ఇటు కార్యాచరన రెండూ కనిపించడం లేదు. ఇరవైనాలుగు పుల్లల గొడుగుగా జే సి విస్తరిస్తే  రాజకీయ పార్టీలు గొడుగు కింద తలదాచుకున్తున్నాయి. అదికూడా ఎన్నికల దాకే! తరువాత ఎవరిదారి వారిదే అంటున్నాయి.  ఎన్నికల దాకా జాయింట్ గా ఉంటాం ఎన్నికల్లో ఎవరి యాక్షన్ వాళ్ళది ఆంటే ప్రజలకు నిజంగానే పిచ్చెక్కుతుంది.  టీ ఆర్ ఎస్, బీ జే పీ నిన్న ఎన్నికల్లో ఒకరి మీద ఒకరు కత్తులు దూసుకున్నారురేపు రాబోయే పరకాల కోసం ఎవరి వలలు వాళ్ళు బుజాన వేసుకుని తిరుగుతున్నారు.  వాళ్ళు ఉమ్మడిగా   ఉద్యమాన్ని నడిపించడం  వీలయ్యే పని  కాదు.  రాజకీయ అవసరాల రీత్యా కూడా అది అనైతికమే అవుతుంది.  రాజకీయ జే సి చేర్మన్ గా ఒకే ఒరలో రెండుకత్తులు పెట్టుకుని యుద్ధం చేస్తానంటే కోదండరామ్ ను ఎవరూ నమ్మరు. జే సి నమ్మకాన్ని పోగొట్టుకుంటే మొత్తం తెలంగాణ ఉద్యమానికే నష్టం. నష్టం ప్రజల ఆత్మ స్థైర్యాన్ని మరింత దెబ్బదీసే ప్రమాదం ఉంది.
  ఏకాభిప్రాయం లేని వాళ్ళు  రాజకీయ పార్టీలు జే సి కి అనుగుణంగా నడుచుకోవదమో లేక జే సి వారిని వదిలిన్చుకోవదమో తప్పనిసరి. అలాగని రాజకీయ పార్టీలను దూరం చేసుకోవాలని కాదు. వాళ్ళనూ కొద్దిరోజులు స్వతంత్రంగా ఎవరిసత్తా ఏమిటో నిరూపించుకోవడానికి ఒక అవకాశం ఇచ్చి చూస్తే తప్పేమీ లేదు. ఇప్పుడు రాబోయే ఎన్నికల్లో అన్ని సీట్లూ మావే అని బీరాలు పలుకుతున్న కొన్ని  పార్టీలకు చాలా గ్రామాల్లో, మండలాల్లో పార్టీ శాఖలు కూడాలేవు రకంగానైనా వాళ్ళు వారి వారి పార్టీల పునాదులను పటిష్టం చేసుకుంటారు. రెండేళ్ళ సమయం ఇచ్చి రెండేళ్లలో ఎవరు ఎవరివైపో తేల్చి 2014 లో ప్రజల పక్షాన లేని పార్టీలను నిజంగానే కుప్పవేసి కాల్చి పడేయవచ్చు.   అవకాశం తప్పక వస్తుంది. అప్పటిదాకా ఎవరూ కాలిపోవద్దనే కోరుకుందాం
కొసమెరుపు
కేసీఆర్ చెప్పినట్టు ఒకవేళ ఆలోపే టీ ఆర్ ఎస్ కాంగ్రెస్ లో విలీనం అయితే? అనుమానమే ఇంకో మిత్రునికి వచ్చింది. కే సి ఆర్ మాట అన్నాడో లేదో తెలియదు. అన్నాడని పత్రికలో వచ్చిన వార్త ను అవునని అంగీకరించలేదు,  కాదని ఖండించలేదు. తెలంగాణా ఇస్తే టీ ఆర్ ఎస్ ను విలీనం చేయడం చాలా పెద్ద త్యాగం. తెలంగాణా సాధన కోసమే పార్టీ పెట్టిన కే సి ఆర్ కు రాష్ట్ర సాధన ముందు  పార్టీ విలీనం అనేది అతి చిన్న విషయంగా అనిపించవచ్చు.  కానీ మిత్రుడు మాత్రం కాంగ్రెస్ తెలుగుదేశం లేని తెలంగాణా కావాలని కోరుకుంటున్నాడు. తెలంగాణా రాష్ట్రంలో టీ ఆర్ ఎస్   ఉండాలనుకున్తున్నాడు